: చక్కటి సంగీతంతో నెలతక్కువ పిల్లలకు స్వస్థత
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి: అని మన పురాణాలు సంగీతం గురించి చాలా గొప్పగా చెబుతాయి. సంగీతంతో ఎన్నెన్ని అద్భుతాలను సాధించవచ్చో మనం అనేకం వింటుంటాం. అయితే.. 9నెలలు నిండకముందే పుట్టి, కొన్ని నెలలపాటూ నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ బతికే నెలతక్కువ పసిపిల్లలకు త్వరగా స్వస్థత చేకూరడానికి కూడా సంగీతం ఎంతో బాగా ఉపకరిస్తుందని తాజా పరిశోధనలు తేలుస్తున్నాయి. ఐసీయూలో ఇటువంటి సమస్యలున్న దాదాపు 300 మంది పిల్లలపై న్యూయార్క్‌లో పరిశోధనలు నిర్వహించారు.
ఇలాంటి పిల్లలకు డాక్టర్లు మూడు రకాల సంగీతం వినిపించార్ట. నిద్రలోకి జారుకునేలా మంద్రమైన వాద్య సంగీతం, తల్లి గుండెచప్పుడు పోలిఉండే సంగీతం, తల్లి స్వరంతో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాటలను వినిపించారు. మూడు వారాల పాటూ ఈ సంగీత చికిత్స చేసిన తర్వాత.. పిల్లల్లో చాలా మెరుగుదల కనిపించిందిట. వారి హృదయస్పందన, పాలు తాగే పద్ధతి, ఆహారం తీసుకోవడం అన్నీ మెరుగుపడ్డాయని డాక్టర్లు తేల్చారు.
అమ్మగొంతుతో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్ పాట విన్నప్పుడు శిశువుల రక్తంలో ప్రాణవాయువు స్థాయి పెరిగినట్లుగా గుర్తించడం ఈ ప్రయోగంలో విశేషం.