: సయీద్ ను మరోసారి కలుస్తా: వైదిక్


సంచలన జర్నలిస్ట్ వైదిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై దాడులకు మూల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ ను కలిసినందుకు దేశ వ్యాప్తంగా విమర్శల పాలైన వైదిక్ తన చర్యలను సమర్థించుకున్నారు. హఫీజ్ సయీద్ ను కలిసిినందుకు తానేమి బాధపడటం లేదని ఆయన అన్నారు. అవసరమైతే రెండోసారి కూడా తాను సయీద్ ను కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. జర్నలిజం తన వృత్తి అని... తన వృత్తిలో భాగంగా తాను రకరకాల వ్యక్తులను కలుసుకుంటానని వైదిక్ వ్యాఖ్యానించారు. 26/11 లాంటి దారుణమైన దాడులకు మూలకారకుడైన సయీద్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనే తాను ఆయనను కలిశానని వైదిక్ చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కూడా తాను కలిశానని ఆయన అన్నారు. నవాజ్ షరీఫ్ ను కలిసిన విషయం ఏ మాత్రం హైలైట్ చెయ్యకుండా... కేవలం హఫీజ్ సయీద్ ను కలవడాన్ని మాత్రమే అందరూ అనవసరంగా ఫోకస్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను గతంలో ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ తో పాటు చాలామంది తాలిబన్ నాయకులను కూడా కలిశానని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి మోడీకి తాను సన్నిహితుడినని... అయితే హఫీజ్ సయీద్ ను కలవడంలో మోడీకి గాని, బీజేపీ ప్రభుత్వానికి గాని ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు పాక్ జర్నలిస్టులు తనకు హఫీజ్ సయీద్ అపాయింట్ మెంట్ ను ఇప్పించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News