: దర్యాప్తు పూర్తయ్యేదాకా నిందలు వేయొద్దు: పుతిన్
మలేసియా విమానం కూల్చివేతకు సంబంధించిన దర్యాప్తు పూర్తి అయ్యేదాకా తమపై ఎలాంటి నిందలు వేయడం సబబు కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. తొందరపాటు అంచనాల వల్ల వాస్తవాలు మరుగునపడిపోవడమే కాక, దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తుకు ఇప్పటికే రష్యా అంగీకరించిందని ఆ ప్రకటన పేర్కొంది. దర్యాప్తు పూర్తి కాకుండా ఎలాంటి రాజకీయ ఉద్దేశాలతో కూడిన ప్రకటనలు జారీ చేయడం తగదని సూచించింది. ఉక్రెయిన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి ఆదివారం రాత్రి పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో చర్చించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ సహకారంతో శాంతియుత పద్ధతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు గుర్తించారు. మలేసియా విమాన దుర్ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కామెరూన్ అభిప్రాయపడ్డారు. జర్మనీ ఛాన్సెలర్ ఎంజెలా మెర్కెల్ తోనూ పుతిన్ ఈ విషయంపై మాట్లాడారు.