: శవాలనే కాదు, శరీరభాగాలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు!
మలేసియా విమాన దుర్ఘటనలో కేవలం మృతదేహాలనే కాదు..... చెల్లాచెదురుగా పడిపోయిన ప్రయాణికుల శరీర భాగాలను కూడా రష్యన్ అనుకూల సాయుధ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం కూలిన ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోరెజ్ రైల్వైే స్టేషన్ లో తిరుగుబాటుదారులు ఈ మృతదేహాలను ఉంచారు. టోరెజ్ నగరం రష్యన్ అనుకూల సాయుధ తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతం కావడంతో మృతదేహాలను ఆ నగరానికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను...చిధ్రమైన విడి శరీర భాగాలను తిరుగుబాటుదారులు టోరెజ్ నగరంలోని మూడు ఎయిర్ కండిషన్డ్ రైల్వే వ్యాగన్లలో భద్రపరిచారు. మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల భాగం తరలించేందుకు ప్రయత్నం చేస్తుండగా.... తిరుగబాటుదారులు వాటిని తమ స్వాధీనం చెయ్యాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆ శాఖ ప్రతినిధి నటాలియా బెస్ట్రో తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ప్రాంతం కావడంతో తాము వారు చెప్పినట్లే చెయ్యాల్సి వస్తోందని ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ఆవేదన వ్యక్తం చేసింది.