: నల్లధనంపై చర్చల కోసం భారత్ కు స్విట్జర్లాండ్ ఆహ్వానం


తమ దేశంలో మూలుగుతున్న నల్లధనం విషయంపై చర్చలకు రావాల్సిందిగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత సర్కారుకు ఆహ్వానం పంపింది. భారత్ కు చెందిన పలువురు రాజకీయ నేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు అక్రమంగా కూడబెట్టిన సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచారన్న సమాచారంతో సదరు వివరాలను వెల్లడి చేయాలని చాలాకాలంగా భారత్, స్విట్జర్లాండ్ ను డిమాండ్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని దేశానికి తెప్పించి తీరతామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్విస్ నుంచి ఈ తరహా ఆహ్వానం రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంపై స్విస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ, పన్ను విషయాల్లో మరింత సహకారం కోసం పాలనాధికారులతో కూడిన ప్రతినిధి బృందాన్ని తాము ఆహ్వానించామని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పటికే భారత్ నల్ల కుబేరుల జాబితాగా భావిస్తున్న కొంత సమాచారాన్ని ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి సేకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ జాబితాలు తస్కరించిన జాబితాలని, వాటిలోని వివరాలు పూర్తిగా వాస్తవం కాకపోవచ్చని చెబుతున్న స్విస్, వాటి పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తోంది. అయితే, తాజా ఆహ్వానంతో భారత్ కు చెందిన నల్ల కుబేరుల జాబితాను స్విస్ బహిర్గతం చేసే అవకాశాలు మెరుగయ్యాయన్న ప్రచారం ఊపందుకుంది.

  • Loading...

More Telugu News