: చంద్రబాబు సీఎం కావడం మన అదృష్టం: వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలా బాధించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రధాని మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని చెప్పారు. చంద్రబాబుకు అండగా ఉండి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు పనిచేస్తానని అన్నారు. నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వెనుక చంద్రబాబు కృషి కూడా చాలా ఉందని వెంకయ్య చెప్పారు. నెల్లూరు ప్రజలకు ఈ వైద్య కళాశాల చాలా ఉపయోగకరమని తెలిపారు. నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.