: యూపీ పెద్ద రాష్ట్రం కదా, రేపులు జరుగుతుంటాయ్: ములాయం
ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న అత్యాచారాల విషయమై అధికార సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఏమంటున్నారో చూడండి. యూపీ పెద్ద రాష్ట్రం కాబట్టి, ఆ మాత్రం రేపులు జరగడం సాధారణమేనని అంటున్నారు. అయితే, మిగతా రాష్ట్రాలతో పోల్చితే అత్యాచారాలు తక్కువగా నమోదవుతున్న రాష్ట్రం కూడా తమదేనని చెప్పుకొచ్చారు. వైద్య పరిశోధన సంస్థ ఉద్యోగినిపై లక్నోలో జరిగిన అత్యాచార ఘటనపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే యూపీలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడి జనాభా సంఖ్యను ఓసారి చూడండి... యూపీలో 21 కోట్ల మంది ప్రజలున్నారు. ఏ రాష్ట్రంలోనైనా తక్కువ అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే అది యూపీనే" అని ములాయం విశ్లేషించారు. మీడియా ఇలాంటి విషయాలను పెద్దవిగా చేసి చూపడం మానుకోవాలని సూచించారు.