: కోదండరాం ఇంటిపై దాడికి ఓయూ విద్యార్థుల యత్నం
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఓయూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. తాము చేస్తున్న ఆందోళనకు టీజేఏసీ మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేసీఆర్ పై టీజాక్ ఛైర్మన్ కోదండరాం ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థులు కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని వారు నిరసన చేపట్టారు. తార్నాక సర్కిల్ లో రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ చెయ్యడం వల్ల తమ భవిష్యత్ అంధకారం అవుతుందని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.