: వైఎస్సార్ కాంగ్రెస్ లో మహిళలకు గౌరవం లేదు!: అరకు ఎంపీ కొత్తపల్లి గీత
ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులను విమర్శిస్తూ... ఆ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మహిళలంటే గౌరవం లేదని... ఎంపీనైన తనపై కూడా వివక్ష చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. కేవలం మహిళను అవడం వల్లే వైసీపీ నాయకులు తనను చిన్న చూపు చూస్తున్నారని గీత వ్యాఖ్యానించారు. ఇటీవల జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు... స్థానిక నేతలు ఆ విషయం తనకు మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖ జిల్లాల వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాల్లో తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. తన సేవలు పార్టీకి అవసరం లేదని స్థానిక నేతలు భావిస్తున్నారని... అందుకే తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని ఆమె ఆరోపించారు రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే కచ్చితంగా ఓ గాడ్ ఫాదర్ అవసరమని గీత అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం కాస్త అసంతృప్తికి లోనైనప్పటికీ....ఇప్పటికిప్పుడు పార్టీ మార్చే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఒక వేళ పార్టీ మారాల్సి వస్తే.... వైసీపీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు.