: లార్డ్స్ టెస్టులో రికార్డులివే


టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ లో గురువారం ఆరంభమైన రెండో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే... టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఆండర్సన్ రికార్డు పుటలకెక్కాడు. ఆండర్సన్ 55 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు ఫ్రెడ్ ట్రూమన్ (43 టెస్టుల్లో 229 వికెట్లు) పేరిట ఉండేది. లార్డ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా ఆండర్సనే. ఈ మైదానంలో 16 టెస్టులాడి 72 వికెట్లు పడగొట్టాడు. దీంతో, సర్ ఇయాన్ బోథమ్ (15 టెస్టుల్లో 69 వికెట్లు) రికార్డు తెరమరుగైంది. భారత్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లిష్ బౌలర్ కూడా ఆండర్సన్ (30 వికెట్లు) కావడం విశేషం. సెంచరీ హీరో రహానే లార్డ్స్ లో సెంచరీ చేసిన 9వ భారత క్రికెటర్ . అంతేగాకుండా, లార్డ్స్ లో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్లలో నాలుగోవాడయ్యాడు. ఇంతకుముందు దిలీప్ వెంగ్ సర్కార్, అజిత్ అగార్కర్, సౌరవ్ గంగూలీ ఈ ఘనత సాధించారు. తొలి రోజు ఆటలో రహానే, భువనేశ్వర్ మధ్య 90 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం నడిచింది. లార్డ్స్ లో భారత్ కు ఇంగ్లండ్ పై ఎనిమిదో వికెట్ కు ఇదే అత్యుత్తమం. ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ 250 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ ఎనిమిదవ క్రికెటర్!

  • Loading...

More Telugu News