: ఇంటికో రుణ మాఫీ తప్పక చేస్తా: చంద్రబాబు
రైతు రుణమాఫీకి ఎంతో ప్రయత్నం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంటికో రుణమాఫీ తప్పక చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో జరిగిన రైతు సదస్సులో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ గురించి ఇప్పటికే ఆర్బీఐ గవర్నరుతో, ఆర్థిక మంత్రి యనమలతో చర్చించానని అన్నారు. కాంగ్రెస్ ఏనాడూ రైతు రుణమాఫీ గురించి పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లుగా రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, రైతుల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తానన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ సాధ్యమయ్యిందన్నారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ను అభివృద్ధి చేస్తానన్నారు. ఇసుక, లిక్కర్ మాఫియాను అరికడతానని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తామని బాబు చెప్పారు.