: ఎర్రచందనం స్మగ్లర్లకు లేటెస్ట్ అడ్డాగా మారిన నల్లమల
నిన్నమొన్నటి వరకు శేషాచలం అడవుల్లో వేలాది ఎర్రచందనం చెట్లను నరికివేసిన స్మగ్లర్లు తాజాగా తమ దృష్టిని నల్లమల అడవులపై సారించారు. శేషాచలం అడవుల్లో టీడీపీ ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో తాజాగా ఈ కేటుగాళ్లు తమ వ్యాపారానికి స్థావరంగా ఇప్పుడు నల్లమలను ఎంచుకున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు పశ్చిమాన ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. వందలకోట్ల విలువైన అటవీ సంపదను రాత్రివేళల్లో స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం చెెట్లు నరికేందుకు స్థానిక కూలీలను పురమాయిస్తూ... చీకటి వేళల్లో దర్జాగా తమ పని కానిచ్చేస్తున్నారు. దాడులు జరిగినప్పుడు కూలీలు అరెస్ట్ అవుతుంటే... కోట్లు వెనకేసుకునే స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. విదేశాల్లో రెడ్ శ్యాండల్ వుడ్ (ఎర్ర చందనం)కు భారీ డిమాండ్ ఉంది. ఔషధాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ గృహోపకరణాల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో చందనంతో చేసిన వస్తువులను వాడడాన్ని శుభసూచకంగా భావిస్తారు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎంతకైనా తెగబడుతున్నారు.