: చనిపోయిందనుకున్న బాలిక తిరిగి లేచింది!
జ్వరం బారిన పడిన ఆ మూడేళ్ల బాలిక మృతి చెందిందని భావించిన తల్లిదండ్రులు శోకతప్త హృదయంతోనే బాలిక అంతిమ యాత్రకు సిద్ధపడ్డారు. శవ పేటికలోనూ పెట్టేశారు. అయితే శవ పేటికలోని బాలికలో ఉన్నట్లుండి కదలిక కనిపించింది. ఇంకేముంది సంతోషంతో ఉబ్బితబ్బైన బాలిక తండ్రి, శవ పేటిక లోని చిన్నారి కూతురిని చేతుల్లోకి తీసుకుని తన్మయత్వంతో ముద్దాడాడు. ఫిలిఫ్పీన్స్ లో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. గత శుక్రవారం జ్వరం సోకిన బాలికను ఆస్పత్రిలో చేర్చగా, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలిక మరణించింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు చనిపోవడంతో తీవ్రమైన వేదనలో మునిగిపోయిన తల్లిదండ్రులు ఆదివారం బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తీరా అంత్యక్రియలకు కొద్ది సెకన్ల ముందు శవ పేటికలోని బాలిక శరీరంలో కదలిక గమనించిన బాలిక తండ్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిడ్డను అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఫేస్ బుక్ లో పెట్టారు. దీనిని లక్షలాది మంది ఫేస్ బుక్ యూజర్లు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు.