: బాబూ... సాగులోకి దిగొద్దు: కొడుకుతో ఓ తండ్రి చివరి మాటలు


దేశానికి వెన్నెముకలా నిలిచిన వ్యవసాయరంగం... ప్రస్తుతం రైతులకు మోయలేని భారంగా మారిందనడానికి తార్కాణాలు బోలెడన్ని. ఇటీవల మెదక్ జిల్లాలో బలవన్మరణం పాలైన ఓ రైతు, తన చిన్నారి కొడుకుతో అన్న చివరి మాటలు, పరిస్థితి ఎంత విషమంగా మారిందో చెప్పకనే చెబుతున్నాయి. జిల్లాలోని రాయవరం గ్రామానికి చెందిన ఏడేళ్ల వంశీ కులాసాగా పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇంతలో అతడి తండ్రి నేరుగా పాఠశాలలోకి వచ్చి కొడుకును బయటకు తీసుకెళ్లి, ఓ హోటల్ ముందు కూర్చున్నాడు. కొడుక్కి టీ, బన్ను ఇప్పించి, బాగా చదవాలని చెప్పాడు. చివరగా ’భవిష్యత్తులో నీవు రైతుగా మాత్రం మారొద్దు‘ అని చెప్పి, కొడుకును పాఠశాలలో దించేసి వెళ్లిపోయాడు. అరగంట గడిచేసరికి, వంశీ తండ్రి చనిపోయాడన్న వార్త పాఠశాలకు చేరింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నేటి రైతు దీనగాథను కళ్లకు కడుతోంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సాగు భారమైన నేపథ్యంలో వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు వలసలు బాగా పెరిగాయి. దీంతో జీడీపీలో వ్యవసాయం వాటా 15.2 నుంచి 13.9కి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో భారత్ లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదముందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి కూలీ కూడా రైతు కంటే ఎక్కువగా సంపాదిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ ఒక్కరు కూడా తమ పిల్లలు వ్యవసాయంలో రాణించాలని కోరుకోవడం లేదని పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయులు అంటున్నారు. 2001 నుంచి 2011 వరకు దేశంలో 90 లక్షల మంది సాగును వదిలిపెట్టేశారట.

  • Loading...

More Telugu News