: విజయవాడలో ‘పెళ్లి కాని ప్రసాదులు’ పెరిగిపోతున్నారు!
విజయవాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి పెళ్లి కావడం లేదట. వారికి కన్యాదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పేరుకు గవర్నమెంటు సంస్థలో పనిచేస్తున్నా... పెళ్లి కావడం లేదెందుకని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో వందలాది మంది యువకులు కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది జీతాలను సక్రమంగా అందుకోవడం లేదు. జీతాలివ్వాలంటూ వారు తరచుగా చేసే ధర్నాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి చూపులకు వెళ్లిన యువకులకు ‘మ్యాచ్ ఫిక్స్’ కావడం లేదు. ‘జీతాలు సక్రమంగా రాని మీరు మా అమ్మాయిని ఎలా పోషిస్తారు?’ అని ఆడపిల్లల తండ్రులు అడిగే ప్రశ్నలకు వీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే పెళ్లి కాని ప్రసాదుల గురించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఆయన ఏపీఎన్జీవోల అభినందన సభలో హామీ ఇచ్చారు. సో, పెళ్లి కాని ప్రసాదుల సమస్య తీరుతుందని ఆశిద్దాం.