: ఎన్నికల ఖర్చులపై నేతల అంకెల గారడీ!
ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం మన రాజకీయ పార్టీల నేతలు చెబుతున్న లెక్కలను చూస్తే మతి పోవడం ఖాయమే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మన నేతలు ఎన్నికల సంఘం అనుమతించిన పరిధి మేరకు కూడా ఖర్చు చేయలేదట. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు ప్రచారం ముగిసే దాకా తెగ తిరిగిన మన నేతాశ్రీలు, ప్రచారంలో భాగంగా తాము చేసిన ఖర్చులు చాలా తక్కువేనని ప్రమాణ పత్రాలు సహా ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావులతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పర్యటనలకు అంతగా ఖర్చేమీ కాలేదని చెప్పుకొచ్చారు. అంతేకాక ప్రచారంలో వీలయినంత మేర ప్రజలను పలుకరించాలన్న యావతో మనవాళ్లు హెలికాఫ్టర్లను కూడా ఎడాపెడా వాడేసిన సంగతి మనం కళ్లారా చూశాం. అయితే అలాంటిదేమీ లేదని అంటూ మన నాయక గణం పరిమితికి లోబడే ఖర్చు చేశామని బుకాయిస్తోండటం విడ్డూరం. చంద్రబాబు విషయానికొస్తే.., మొన్నటి ఎన్నికల కోసం ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ. 20.89 లక్షలేనట. అంతేకాదండోయ్, హెలికాఫ్టర్ వినియోగానికి సంబంధించి ఆయన చిల్లిగవ్వ కూడా వెచ్చించలేదట. కేసీఆర్ విషయానికొస్తే, గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రచారంలో భాగంగా కేవలం రూ. 46 లక్షలు మాత్రం ఖర్చయ్యాయట. హెలికాఫ్టర్ కోసం మాత్రం మొత్తం ఖర్చులోనే కేవలం రూ. 3. లక్షలు వెచ్చించారట. ఇక వైఎస్ జగన్ అయితే అంకెల గారడీలో తాను అందరికంటే మిన్న అని నిరూపించుకున్నారు. మొన్నటి ఎన్నికల కోసం ఆయన కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారట! ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న అశోక్ గజపతి రాజు, ప్రచారానికి కేవలం రూ. 4.10 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అయితే మరీ దారుణమైన లెక్కలు చూపారు. మోడీ, చంద్రబాబు తదితర మహామహులతో గుంటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయనకైన ఖర్చు కేవలం రూ.34,350 మాత్రమేనట. లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ సభలో వాటర్ ప్యాకెట్లకు కూడా సరిపోని రూ. 34 వేలతో ఏకంగా సభనే నిర్వహించినట్లు పేర్కొనడం గమనార్హం!