: తీహార్ జైల్లో ఏసీ రెస్టారెంట్... ఖైదీలే సర్వర్లు
జైళ్ళలో బేకరీలు, పెట్రోల్ బంకులు ఇప్పటివరకు మనం విన్నాం. తాజాగా తీహార్ జైల్ ఖైదీలతో ఏసీ రెస్టారెంట్ ను ప్రారంభించారు అధికారులు. ఢిల్లీలోని జైల్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్లో ఖైదీలే సర్వర్లు. అలాగని వారేమీ శిక్షణ లేకుండా బరిలో దిగుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. టూరిజం మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో హోటల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ పొందిన ఖైదీలు ఈ రెస్టారెంట్ లో పనిచేస్తారు. ఉదయం పదింటి నుంచి రాత్రి పదింటి వరకు ఈ ఏసీ రెస్టారెంట్ తెరిచి ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో 50 మంది వరకు కూర్చోవచ్చు. జైలుకు కిలోమీటర్ పరిధిలో ప్రాంతాలకు క్యాటరింగ్ కూడా అందించగలమని జైలు వర్గాలు చెబుతున్నాయి.