: పోలవరంపై కేసీఆర్ తీరును ప్రశ్నించిన షబ్బీర్ అలీ
పోలవరం ఆర్డినెన్స్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపరాదంటూ కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లలేదని ప్రశ్నించారు. హస్తిన వెళ్లకుండా మోహం ఎందుకు చాటేశారని నిలదీశారు. పోలవరంపై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళతానన్న కేసీఆర్ హామీ ఏమైందన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన షబ్బీర్, అసలు పోలవరం ఆర్డినెన్స్ ను ఆపేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలేమిటని సూటిగా అడిగారు. 1956కు ముందున్న ప్రాంతాలనే తెలంగాణలో కలపాలని కోరడం వల్లనే ముంపు గ్రామాలు ఆంధ్రాలోకి వెళుతున్నాయని అన్నారు. అటు ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిని సీపీఐ కూడా నిలదీసింది. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు.