: సాకర్ ప్రపంచ కప్ విజేత జర్మనీ... దక్షిణ అమెరికాలో ఐరోపా జెండా
యూరోపియన్ సాకర్ దిగ్గజం జర్మనీ చరిత్ర సృష్టించింది. బ్రెజిల్ రాజధాని రియోడిజనీరోలో రాత్రి జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో 1-0తో అర్జెంటీనాను చిత్తు చేసింది. చారిత్రక మారకానా స్టేడియంలో... కిక్కిరిసిన అభిమానుల మధ్య... బలమైన జర్మనీ, ఊపుమీదున్న అర్జెంటీనా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో... అదనపు సమయం (30 నిమిషాలు) కేటాయించారు. ఈ సమయం కూడా కరిగిపోతున్న సమయంలో... పెనాల్టీ షూటౌట్ తప్పదేమో అని అందరూ భావించారు. సరిగ్గా ఏడు నిమిషాల్లో అదనపు సమయం అయిపోతుందనగా అద్భుతం జరిగింది. ఆట 113వ నిమిషంలో పాస్ అందుకున్న గోట్జె తన ముందు ఒంటరిగా ఉన్న అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరోను బోల్తా కొట్టించాడు. అద్భుతమైన గోల్ తో అర్జెంటీనాను ఖంగుతినిపించాడు. ఆ తర్వాత అర్జెంటీనా ఎంత ప్రయత్నించినా గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. అర్జెంటీనా స్టార్ మెస్సీ సర్వశక్తులను ఒడ్డినా తన దేశాన్ని ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. దీంతో ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇంతవరకు అమెరికా ఖండాల్లో ఏ ఒక్క యూరోపియన్ జట్టు కూడా ప్రపంచకప్ ను గెలవలేదు. ఈ విజయంతో అమెరికా ఖండంపై ప్రపంచ కప్ గెలిచిన తొలి యూరోపియన్ దేశంగా జర్మనీ అవతరించింది.