: నెల్లూరు, ఒంగోలు జడ్పీ పరోక్ష ఎన్నికలు నేడే
ఈ నెల ఐదో తేదీన వాయిదా పడ్డ నెల్లూరు, ఒంగోలు జిల్లా పరిషత్ పరోక్ష ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలు ఉండగా... వైకాపా 31, టీడీపీ 15 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ఆరు మంది వైకాపా సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది సభ్యులు చేజారకుండా చూసుకునేందుకు... ఇడుపుల పాయలో వైకాపా క్యాంపు నిర్వహించింది. ఈ క్రమంలో ఇద్దరు వైకాపా సభ్యలను దాచారంటూ నెల్లూరు పోలీసులు ఇడుపులపాయకు వచ్చారు. దీంతో, ఇడుపులపాయలో నిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒంగోలు విషయానికొస్తే... టీడీపీ, వైకాపాలకు చెరో 28 మంది చొప్పున సమాన బలం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అందర్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు జరగనున్న ఈ రెండు ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.