: మళ్ళీ యూట్యూబ్ ను ఊపేస్తున్న 'గాంగ్నమ్' ఫేమ్
'గాంగ్నమ్ స్టయిల్'..! ఓ అనామక గాయకుడిని ఓవర్ నైట్ స్టార్ ని చేసిన పాట ఇది. అందులోని స్టెప్టుల విలక్షణీయత, అర్థంకాని భాషైనా, ఆ పదాల విరుపుల సొగసు.. గాయకుడు 'సై' విచిత్ర ఆహార్యం 'గాంగ్నమ్ స్టయిల్'ను సెన్సేషనల్ హిట్ లా మలిచాయి. యూట్యూబ్ లో ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ సైట్లో ఈ గీతాన్ని ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 152 కోట్లమంది వీక్షించారంటేనే అర్థమవుతోంది సై రూపొందించింది అల్లాటప్పా పాటను కాదని!
ఇప్పుడదే స్టార్ సింగర్ మరో వీడియోను రిలీజ్ చేశాడు. శనివారం సియోల్ లో 'జెంటిల్ మన్' పేరిట విడుదల చేసిన ఈ కొత్త పాట కూడా గాంగ్నమ్ స్టయిల్ ను తలదన్నేలా యూట్యూబ్ ను దున్నేస్తుండడం విశేషం. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే కోటీ ఏడు లక్షల హిట్స్ తో దూసుకెళుతోంది. అయితే ఈ పాటకు 'హార్లెమ్ షేక్' డ్యాన్స్ ఓరియెంటెడ్ సాంగ్ గట్టిపోటీ ఇస్తుందని సంగీత ప్రపంచం భావిస్తోంది. కానీ, సై మాత్రం తన 'జెంటిల్ మన్' పట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నాడు. ఏదీ తనకు పోటీ కాదని ధీమా వ్యక్తం చేస్తున్నాడీ నవతరం పాప్ స్టార్.