: ఆ రెండు విమానాల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు
ఇండిగో, ఎయిరిండియా విమానాల్లోని ప్రయాణికులు కొద్ది నిమిషాల పాటు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని బగ్డోరాలోని విమానాశ్రయంలో ఏటీసీ చేసిన పొరపాటు చాలామంది ప్రయాణికులకు గ్రహపాటుగా మరింది. రన్ వే పైనున్న ఇండిగో విమానం 130 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోబోతుండగా, 120 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం ల్యాండయ్యేందుకు వస్తోంది. అంతే, రెండు విమానాలు ఢీ కొట్టడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో... పైలట్లిద్దరూ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం రెండు విమానాల మధ్య దూరం కిలోమీటర్ ఉండాలి. లేని పక్షంలో వాటిని అదుపుచేయడం, ప్రమాదాల నుంచి గట్టెక్కించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఏటీసీ రెండు విమానాలకు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఇండిగో విమానం బయల్దేరడమూ, ఎయిరిండియా విమానం ల్యాండింగ్ కు సిద్ధం కావడం ఒకేసారి జరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెడ్ సిస్టమ్ ఇండిగో విమాన కెప్టెన్ కు హెచ్చరిక వెళ్లింది. దీంతో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఆయన విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఇంతలో ఎయిరిండియా విమానం కుడివైపుకు తిరిగింది. ఇద్దరు కెప్టెన్లకు క్లియర్ ఆఫ్ కాన్ ఫ్లిక్ట్ సందేశం రాగానే విమానాలను వారు మామూలు స్థితికి తీసుకువచ్చారు. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు ప్రశాంతంగా ఊపిరిపీల్చుకున్నారు.