: మీ ఆలోచన మార్చుకోండి...దేశ ప్రతిష్ఠను పెంచండి: మేనకాగాంధీ
పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ సూచించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే సమాజంలో మార్పు రావడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. అనాలోచితంగా నేరప్రవృత్తితో చేసే అత్యాచారాలు దేశ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సన్నిహితులు, పరిచయస్తులే ఈ అత్యాచారాలు, కిడ్నాపులు చేస్తుండడంపై మహిళల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలను మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టనుందని ఆమె వెల్లడించారు. మహిళా రక్షణ ఎన్డీయే ప్రభుత్వ ప్రాధమిక కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. మహిళలు నివసించే చోట, పనిచేసే చోట మంచి వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.