: భారత్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన
2016లో ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై భారతీయ రైలు పరుగెట్టనుంది. బారాముల్లా, జమ్మూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు కొంకణ్ రైల్వే 2002లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పలు అవాంతరాలను ఎదుర్కొని, మరో రెండేళ్లలో పూర్తి కానుంది. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తుంటుందట. 359 మీటర్ల ఎత్తులో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి కోసం 25 వేల టన్నుల ఉక్కును వినియోగించారట. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే, ఇప్పటిదాకా ఎత్తైన రైల్వే వంతెనగా పరిగణిస్తున్న చైనాలోని బీపాంగ్జియాన్ నదిపై ఉన్న రైల్వే వంతెన (275 మీటర్లు) రెండో స్థానానికి పడిపోతుంది. ప్రస్తుతం బారాముల్లా నుంచి జమ్మూకు వెళ్లేందుకు దాదాపుగా 13 గంటల సమయం పడుతోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే, కేవలం ఆరున్నర గంటల వ్యవధిలోనే గమ్యం చేరుకోవచ్చట. ఈ వంతెన నిర్మాణంలో మన ఇంజినీర్ల గొప్పతనం మరొకటుంది. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా నదీ ప్రవాహానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా పని చేసేశారట. ఈ వంతెన నిర్మాణం కోసం కొంకణ్ రైల్వే దాదాపుగా రూ. 560 కోట్లను వెచ్చిస్తోంది.