: మౌస్ కి ఇక కాలం చెల్లనుంది!
కంప్యూటర్ లో మౌస్ ది ప్రముఖ పాత్ర. మౌస్ లేకపోతే సగం పనులు చక్కబడవు. కీ పాడ్ లో షార్ట్ కట్స్ తెలియని వారికి మౌస్ కీలకమైన వస్తువు. అలాంటి మౌస్ త్వరలో మాయం కానుంది. 1960 నుంచి కంప్యూటర్ ను అంటిపెట్టుకున్న మౌస్ స్థానంలో చేతివేలికి తొడుగులా ఉండే 3డీ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మౌస్ చేసే పనులన్నీ చేస్తుంది. అదీ కాక, ఇది మౌస్ లా కర్సర్ ను రెండు కోణాల్లోనే కాకుండా మూడు కోణాల్లో కదిలిస్తుందని వారు వివరించారు. అందుకే దీనికి ‘3డీ టచ్’ అని పేరు పెట్టారు. త్రీడీ యాక్సిలెరోమీటర్, త్రీడీ మాగ్నెటోమీటర్, త్రీడీ గైరోస్కోప్, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వ్యోమింగ్ పరిశోధకులు దీనిని తయారు చేశారు. దీనిని చేతి వేలుకు తగిలించుకుని ఆ వేలును కంప్యూటర్ తెరముందు కదిలిస్తే చాలు, వేలు కదిలినట్టు కర్సర్ కదులుతుంది. ఆ వేలితో మౌస్ ప్యాడ్‌పై తట్టి క్లిక్ చేస్తూ తెరపై వస్తువులను డ్రాగ్ చేయొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతానికి ఇది వైర్లతో పని చేస్తున్నప్పటికీ భవిష్యత్ లో వైర్ లెస్ గా తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.