: రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ అవసరమా..?
దేశంలోని అన్ని రంగాలకు ఒకే బడ్జెట్ ప్రవేశపెడుతుండగా... రైల్వే రంగానికే మాత్రమే ప్రత్యేకంగా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నారో ఇప్పటికి చాలామందికి అర్థంకాని విషయం. రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పటి నుంచి మొదలైంది. 1924 లో మొదటిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పట్లో దేశంలోని అతి పెద్ద పారిశ్రామిక ఆస్తి రైల్వేనే. ఆ కాలంలో దేశానికి అతిపెద్ద ఆదాయ వనరు కూడా భారతీయ రైల్వేలే. ఈ కారణంగానే రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడమన్నది ఆనవాయతీగా వస్తోంది. అయితే, 1991లో పి.వి నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన తర్వాత దేశంలో అనేక రంగాల అభివృద్ధి ఊపందుకుంది. ఐటి, ఇన్ ఫ్రా, రిటైల్, హెల్త్ కేర్, టెలికాం రంగాలు ఈ పాతికేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు దేశ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్నవి కూడా ఈ రంగాలే. మిగతా రంగాలు దూసుకుపోగా ఈ కాలంలో రైల్వేలు మాత్రం తిరోగమన దిశలో పయనించాయి. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వేలు తమ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాయి. సరైన సమయంలో సంస్కరణలు చేపట్టకపోవడం వలన రైల్వేల ఆర్థిక ప్రగతి కుంటుపడింది. ఇప్పుడు దేశ బడ్జెట్ తో పోల్చుకుంటే రైల్వే బడ్జెట్ చిన్న మొత్తమే. ఈ కారణంగానే రైల్వేల కు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదని, ప్రతి సంవత్సరం ప్రవేశ పెట్టే కేంద్రబడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కలిపేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.