: బ్రెజిల్, జర్మనీ ప్రపంచ కప్ సెమీస్ విశేషాలివే...!
బ్రెజిల్ జర్మనీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ద్వారా చాలా విశేషాలు రికార్డు పుటల్లో చోటుచేసుకున్నాయి. ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఓ జట్టు ఏడు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఏ జట్టూ ప్రపంచకప్ సెమీఫైనల్లోని తొలి అర్ధభాగంలో ఐదు గోల్స్ సమర్పించుకోలేదు. ఆ అపప్రథ బ్రెజిల్ పేరిట లిఖించబడింది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి 29 నిమిషాల్లో 5 గోల్స్ చేసిన తొలి జట్టుగా జర్మనీ నిలిచింది. 2002 తరువాత ప్రపంచకప్‌లోని ఒకే మ్యాచ్‌లో ఎనిమిది గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. 12 ఏళ్ల క్రితం 2002లో జర్మనీ 8-0తో సౌదీ అరేబియాను ఓడించింది. ప్రపంచకప్ టోర్నీలో బ్రెజిల్‌కు ఇదే చెత్త ఓటమి. 1998 ఫైనల్లో బ్రెజిల్ 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆ రికార్డు చెరిగిపోయింది. అంతేకాకుండా మొత్తం ప్రపంచకప్‌లలో ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ (223) చేసిన జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. తాజా ప్రదర్శనతో 220 గోల్స్‌తో నెంబర్ వన్ గా ఉన్న బ్రెజిల్ రెండో స్థానానికి పడిపోయింది. ఫైనల్లో ప్రవేశించడం ద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా జర్మనీ రికార్డు సృష్టించింది. 7 సార్లు ఫైనల్ చేరుకున్న బ్రెజిల్‌ను జర్మనీ వెనక్కినెట్టింది. 1975 తర్వాత బ్రెజిల్ సొంతగడ్డపై అధికారిక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిసారి బ్రెజిల్ 1975 ‘కోపా అమెరికా కప్’ టోర్నీ సెమీఫైనల్లో పెరూ చేతిలో ఓడిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్‌ల విషయానికొస్తే 2002లో చివరిసారి బ్రెజిల్ జట్టు సొంతగడ్డపై ఓడింది.