: ట్రాఫిక్ ఎస్సైని చితకబాదారు!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ట్రాఫిక్ సబ్ ఇన్స్ పెక్టర్ ను ప్రజలు చితకబాదారు. స్కూటీపై వెళుతున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ వీరేంద్ర సింగ్ అనే ఈ ఎస్సైపై విరుచుకుపడ్డారు. సదరు మహిళ ఢిల్లీ నుంచి మోహన్ నగర్ వైపు వెళుతుండగా, డాబర్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడ ఆమె స్కూటీని ఓ కారు ఢీకొన్నది. ఆ సమయంలో వీరేంద్ర సింగ్ అక్కడే విధుల్లో ఉన్నాడు. దీంతో, ఆమె ఎస్సై వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకునే బదులు, ఆమెపైనే వేధింపులకు దిగాడు. అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ ఎస్సైకి దేహశుద్ధి చేశారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, వీరేంద్రకు గాయాలయ్యాయని, ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఘటన సమయంలో అతను తాగి ఉన్నాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని, దోషిగా తేలితే వీరేంద్రపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.