: కత్రీనా కోసం చిన్నారులు దొంగలయ్యారు!
తన అందచందాలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్న బాలీవుడ్ సుందరి కత్రీనా కైఫ్ ను కలిసేందుకు ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి. ఘజియాబాద్ కు చెందిన వైభవ్ శర్మ, కాశిష్ కుమార్, రితేశ్ లు మిత్రులు. ముగ్గురూ పదమూడేళ్ళ ప్రాయంలో ఉన్నారు. గత శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఈ త్రయం మరలా ఇంటికి రాలేదు. దీంతో, తీవ్ర ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు కవినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఓ కానిస్టేబుల్ కవినగర్ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో, పోలీసులు వెళ్ళి బాలురను వెనక్కితీసుకువచ్చారు. ఎందుకెళ్ళారని ప్రశ్నించగా, సినిమా స్టార్లు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసుకుందామని వెళ్ళామని, ముఖ్యంగా కత్రీనా కైఫ్ ను కలవాలనుకున్నామని తెలిపారా టీనేజర్లు. కాగా, వీరి ముగ్గురిలో ఒకరు తన తండ్రి జేబులోంచి ఏటీఎమ్ కార్డు దొంగిలించి, రైలు టికెట్లు కొన్నట్టు తెలిసింది.