: నరసింహన్ కూడా ఇంటికేనా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా రాజీనామా బాట పట్టక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న ఇద్దరు గవర్నర్లు ఆ తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అగస్టా కుంభకోణంలో రాజీనామాలు చేసిన ఇద్దరు గవర్నర్లు ఎంకే నారాయణన్ (పశ్చిమ బెంగాల్), బీవీ వాంచూ (గోవా) గతంలో పోలీసు ఉన్నతాధికారులుగా పనిచేశారు. నరసింహన్ కూడా మాజీ పోలీసు ఉన్నతాధికారే. అగస్టా ఒప్పందం సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ గా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (యస్పీజీ) హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత వారం వారిద్దరినీ సీబీఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత వారిద్దరూ తమ గవర్నర్ గిరీలకు రాజీనామా చేశారు. అగస్టా కేసుకు సంబంధించి సాక్షిగా బుధవారం తమ ముందు హాజరు కావాలని గవర్నర్ నరసింహన్ ను సీబీఐ అధికారులు కోరినట్లు విశ్వసనీయ సమాచారం. నరసింహన్ కూడా మిగిలిన ఇద్దరు గవర్నర్ల లాగే సాక్షిగానే సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో నరసింహన్ కూడా సీబీఐ విచారణ అనంతరం గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.