: వాజ్ పేయి కలల ’రైలు‘ కూత కూసేనా?


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కలలుగన్న రైలు 15 ఏళ్లుగా పట్టాలెక్కనే లేదు. ఆగ్రాకు సమీపంలోని తన పూర్వీకుల గ్రామం భటేశ్వర్ కు రైలు సౌకర్యం కల్పించాలని ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్ పేయి తలచారు. అటుగా వెళుతున్న ఫతేహాబాద్, బాహ్ లైనుకు కలుపుతూ రైల్వే లైను వేసేందుకు అప్పుడే ఉత్తర మధ్య రైల్వే అధికారులు రూ.110 కోట్లతో ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అయితే భూసేకరణకు మాత్రం ఎప్పటికప్పుడు సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. దీంతో 15 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైపోయింది తప్పించి పట్టాలెక్కలేదు. అయితే కాలం గడిచేకొద్దీ ప్రాజెక్టు అంచనా కూడా భారీగా పెరిగిపోయింది. 15 ఏళ్ల క్రితం రూపొందించిన అంచనా ప్రస్తుతం నాలుగు రెట్లకు పైగా పెరిగిపోయింది. భూసేకరణకు సంబంధించి ఆగ్రా పట్టణాభివృద్ధి సంస్థ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే జాప్యానికి కారణమని ఆగ్రా, ఫతేపూర్ సిక్రి ఎంపీలు రామ్ శంకర్ ఖతేరియా, బాబూలాల్ చౌధరీలు వాపోతున్నారు. ఎలాగైనా ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నామని వారు తెలిపారు. అంతేకాక ప్రధాని మోడీ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, సత్వర పరిష్కార దిశగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు వారు పేర్కొంటున్నారు. భటేశ్వర్ లో వర్షాకాలంలో పెద్ద ఎత్తున జరిగే పశువుల సంతకు దేశవ్యాప్తంగా పేరుంది. భటేశ్వర్ కు రైల్వే లైను సౌకర్యం కల్పిస్తే భారత పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నాయని ఆగ్రా టూరిస్ట్ వేల్ఫేర్ చాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News