: వామ్మో... ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయా?


దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో చేస్తున్న చట్టాలకు తోడు న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో వాయిదాలు పడి కేసులు పేరుకుపోయాయని లోక్ సభకు లిఖితపూర్వకంగా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టులో 63,843 కేసులు పెండింగ్ లో ఉండగా, దేశంలోని 24 హైకోర్టుల్లో 44.62 లక్షల కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వివిధ దిగువ స్థాయి కోర్టుల్లో 2.68 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా, మొత్తం అన్ని కోర్టుల్లో కలిపి 3.13 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 24 హైకోర్టుల్లో 906 మంది న్యాయమూర్తులకు గాను, 636 మందే విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన వెల్లడించారు. న్యాయవ్యవస్థను ఆధునికీకరించి, వ్యాజ్యాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన లోక్ సభకు హామీ ఇచ్చారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సూచనలు చేశామని ఆయన తెలిపారు. ఎక్కువ వివాదాలు వచ్చే అంశంపై ఒక విధాన, చట్టపరమైన చర్య తీసుకుని అనవసర వ్యాజ్యాలను తగ్గించాలని భావిస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ వివరించారు.

  • Loading...

More Telugu News