: భారత మాజీ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్ పరిస్థితి విషమం
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్ కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం చౌహాన్ ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఒకటి రెండ్రోజులు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. భిలాయ్ లోని తన నివాసంలో ఉదయం ఆరున్నరకు గుండెనొప్పితో విలవిల్లాడిన చౌహాన్ ను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో బీఎస్ఆర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. తీవ్రమైన స్ట్రోక్ వచ్చిందని, అతడిని ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని అపోలో ఆసుపత్రి డైరక్టర్ ఏపీ సావంత్ తెలిపారు. కాగా, 48 ఏళ్ళ రాజేశ్ చౌహాన్ భారత స్పిన్ త్రయంలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. అనిల్ కుంబ్లే, వెంకటపతిరాజు, చౌహాన్ తో కూడిన భారత బౌలింగ్ లైనప్ అప్పట్లో సొంతగడ్డపై శత్రుదుర్భేద్యంగా ఉండేది. ఈ త్రయం కూర్పులోనే ఎంతో వైవిధ్యముంది. కుంబ్లే లెగ్ స్పిన్నర్ కాగా, వెంకటపతిరాజు లెఫ్టార్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్. ఇక, చౌహాన్ కుడిచేతివాటం ఆఫ్ స్పిన్నర్ కావడంతో ఈ ముగ్గురిని తట్టుకుని ప్రత్యర్థులు క్రీజులో కుదురుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చేది.