: బాపిరాజు గారూ... ఇక చాలు, దయ చేయండి!: మంత్రి మాణిక్యాలరావు
టీటీడీ చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు నేడు కనుమూరి బాపిరాజుకు సూచించారు. పదవి నుంచి తప్పుకోకుంటే ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. యూపీఏ హయాంలో నామినేటెడ్ పదవులు పొందినవారు ఇంకా పదవులు పట్టుకు వేళ్ళాడడం సమంజసం కాదని హితవు పలికారు. మంత్రి నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాపిరాజు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు. కాగా, శ్రీవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికారు.