: లోక్ సభలో పోలవరం బిల్లు ఎందుకు వాయిదా పడింది?


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే (నిన్న) అత్యంత కీలకమైన పోలవరం ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకురావాలనుకున్న మోడీ సర్కారు ప్రయత్నం విఫలమయింది. దీనికి సంబంధించి నిన్నటి అజెండాలో ఐటెం 6, 7లుగా పోలవరం అంశాన్ని పేర్కొన్నారు. అయితే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో లోక్ సభలో బిల్లుపై జారీ చేసిన ప్రకటనను చేపట్టరాదంటూ స్పీకర్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అనుమతి లభించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్లీ సరిహద్దులను మారుస్తుండటం వల్లే రాష్ట్రపతి వైపు నుంచి జాప్యం జరిగింది. రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ప్రణబ్ భావిస్తున్నారు. దీంతో, నిన్న లోక్ సభలో బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్లే పోలవరం బిల్లును సభలో ప్రవేశపెట్టలేకపోయామని వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం వచ్చిన వెంటనే, ఒకట్రెండు రోజుల్లో పోలవరం అంశాన్ని మళ్లీ అజెండాలో చేర్చి, సభలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News