: తమలపాకులు అమ్ముకుంటున్న భారత సాకర్ క్రీడాకారిణి
భారత్ లో క్రికెటేతర క్రీడాకారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఓ ఫుట్ బాల్ క్రీడాకారిణి ఇప్పుడు తమలపాకులు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన రష్మితా పాత్రా (23) భారత్ తరఫున పలు అంతర్జాతీయ సాకర్ ఈవెంట్లలో పాల్గొంది. 2008లో కౌలాలంపూర్లో జరిగిన అండర్-16 ఏఎఫ్సీ అర్హత పోటీలతోపాటు, 2011లో ఢాకాలో జరిగిన సీనియర్ ఏఎఫ్సీ అర్హత పోటీల్లోనూ పాల్గొని డిఫెండర్ గా సత్తా చాటింది. అదే ఏడాది బహ్రెయిన్ లో పర్యటించిన సీనియర్ మహిళల జట్టు తరఫున ఎంపికైంది. ఆ సిరీస్ లో భారత్ 2-1తో విజయం సాధించింది.
తర్వాతి కాలంలో ఫామ్ లోపించడంతో రష్మితను పక్కనబెట్టారు భారత ఫుట్ బాల్ సెలక్టర్లు. అటు కెరీర్ కోల్పోయి, ఇటు జీవనోపాధి లేక రష్మిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత ఏడాదే పెళ్ళి చేసుకున్న ఆమె ఇప్పుడు ఓ తమలపాకుల దుకాణం పెట్టుకుంది. భర్త సంప్రదాయ మత్స్యకారుడు కావడంతో, అతని సంపాదన అంతంతమాత్రం కావడంతో తానూ ఎంతోకొంత సంపాదించాలని ఈ క్రీడాకారిణి నిర్ణయించుకుంది.
ఫుట్ బాల్ కోసం చదువునూ త్యాగం చేశానని, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ చూస్తే ఎంతో బాధ కలుగుతోందని, అందులో ఆడుతున్న క్రీడాకారులు ఎక్కడివాళ్ళైనా గానీ మెరుగైన పారితోషికం అందుకుంటున్నారని పేర్కొంది. ఇక్కడ మాత్రం క్రీడాసంఘాలు గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళను పట్టించుకున్న పాపానపోవని ఆవేదన వ్యక్తం చేసింది.