: బీహార్ అమ్మాయిలను తెచ్చి హర్యానా యువకులతో పెళ్ళి చేస్తాడట!
హర్యానాలో పురుషులకు తగిన సంఖ్యలో స్త్రీలు లేకపోవడంతో బీజేపీ నేత, జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఓపీ ధంఖార్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూడండి. బీహార్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి తమ రాష్ట్ర యువకులకు పెళ్ళి చేస్తామని వాగ్దానం చేశాడు. హర్యానాలోని నిర్వాణ ప్రాంతంలో జరిగిన కిసాన్ మహాసమ్మేళన్ లో దంఖార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెళ్ళికాని హర్యానా యువకులకు బీహారీ అమ్మాయిలను తెచ్చి వివాహం జరిపిస్తామని అన్నారు. అయితే, దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
ధంఖార్ వ్యాఖ్యలపై పూర్వాంచల్ ఏక్తా మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దంఖార్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన దంఖార్, మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. బీహార్లోని కొన్ని దుర్భిక్ష ప్రాంతాల్లో అమ్మాయిలు అక్రమరవాణా పాలబడుతున్నారని, అలాంటి వారికి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతోనే తానా వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతి 1000 మంది పురుషులకు 879 మంది స్త్రీలే ఉన్నారట!