: మే చివరివారంలో అభ్యర్థుల జాబితా: కేసీఆర్
వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటినుంచే కసరత్తులు ఆరంభిస్తోంది. మే చివరివారంలో అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఇక, గత ఎన్నికల పొత్తుల అనుభవాల సారం తలకెక్కిన ఫలితం.. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒంటరిగానే పోటీ చేయాలన్నది పొలిట్ బ్యూరో నిర్ణయమని చెప్పారు. ఇక అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని ప్రకటించారు. సీనియర్ నేత నాయిని నర్శింహారెడ్డి ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ సంఘంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మహ్మద్ అలీ తదితరులు సభ్యులుగా ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సంఘం సూచించిన అభ్యర్థులే ఎన్నికల బరిలో దిగుతారని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 27న ఆర్మూర్ లో టీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు 23 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.