: స్వార్థం లేని ప్రేమ కథ...!
సలీం-అనార్కలీ, దేవదాసు-పారు, లైలా-మజ్ను లను మించిన ప్రేమ కథ ఇదేనేమో... వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. కంచం మంచం ఒకటే టైపు కాదు. వారికి కంచం, మంచం, దుప్పటి, బాత్రూం ఇలా అన్నీ ఒక్కటే. నలభై ఐదేళ్లు ఒకరికి ఒకరుగా బతికారు...వారే గంగ, జమున. అవిభాజ్య కవలలు. శరీరంలో ఏదో ఒక భాగం కలిసి పుట్టే అవిభాజ్య కవలలకు వీరు భిన్నం. అందర్లా వీరికి అన్ని శరీర భాగాలు విడివిడిగా లేవు. ఉదరం పైన భాగాలన్నీ ఎవరికి వారివే.
ఉదరం నుంచి ఇద్దరి శరీరం ఒకటే. పొట్టకూటి కోసం వారిద్దరూ ఓ ట్రావెలింగ్ సర్కస్ లో చేరారు. ఏడు నెలల క్రితం వారిద్దరూ జసీముద్దీన్ అహ్మద్ అనే స్కూల్ టీచర్ తో ప్రేమలో పడ్డారు. వారిని చూసి అతను చలించిపోయాడు. వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి వారు ముగ్గురూ కలిసే ఉంటున్నారు. వారికోసం అహ్మద్ సౌండ్ ఇంజనీర్ గా అదే సర్కస్ కంపెనీలో చేరాడు.
ఇప్పుడు వారు అహ్మద్ ను మిస్టర్ ఇండియా అంటూ పిలుచుకుంటున్నారు. అహ్మద్ చాలా మంచివాడని, తమను బాగా చూసుకుంటాడని, అతనుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని గంగ, జమున చెబుతున్నారు. తమ ప్రతి బాధను అహ్మద్ పంచుకుంటాడని వారిద్దరూ మురిసిపోతున్నారు.