: కేపీ మనసులో మాట
స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ మళ్ళీ ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడే ఘడియల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ఆడాలనుందంటూ కేపీ ట్విట్టర్ ద్వారా తన మనసులో మాట బయటపెట్టాడు. క్రమశిక్షణ రాహిత్యం, మొండివైఖరి కారణంగా ఆసీస్ తో యాషెస్ అనంతరం కేపీని ఇంగ్లండ్ సెలక్టర్లు జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అటుపై ఐపీఎల్ వంటి టోర్నీలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఈ దక్షిణాఫ్రికా జాతీయుడికి అంతర్జాతీయ క్రికెట్ పై ఇంకా మోజు తీరినట్టు లేదు.
తాజాగా, ఎంసీసీ, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య లార్డ్స్ లో జరిగే 'బైసెంటినరీ' మ్యాచ్ లో కేపీ కూడా పాల్గొంటున్నాడు. కేపీకి వరల్డ్ లెవన్ లో చోటు దక్కింది. ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందిస్తూ, లార్డ్స్ లో భారీ జనసందోహం నడుమ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని భావించనేలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున ఇదే మైదానంలో ఆడతాననే భావిస్తున్నానని కేపీ ఆశాభావం వ్యక్తం చేశాడు.