: ఈగ...ఆమెని ఉప సర్పంచ్ ని చేసింది
రాజమౌళి 'ఈగ'కున్నట్టు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈగకు గతం గుర్తులేదు. పోనీ, ఫైట్లు చేసే శక్తి ఉందా అంటే అదీ లేదు. అయినా ఈ ఈగ ఓ మహిళను ఉప సర్పంచ్ ని చేసింది. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేధ్ (రాజ్ గురు నగర్) తాలూకాలో సత్కారప్తల్ అనే గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. అక్కడ ఉప సర్పంచ్ ను ఎన్నుకోవాలంటే గ్రామంలోని భైరవనాథ్ ఆలయంలో ఉప సర్పంచ్ అభ్యర్థుల పేర్లను చిట్టీలలో రాసి పెడతారు.
వాటిలో దేనిపై ఈగ ముందుగా వాలుతుందో వారే ఉప సర్పంచ్. ఈ సంప్రదాయం చాలా కాలంగా వస్తోంది. దీనిని ఇంతవరకు ఎవరూ ప్రశ్నించలేదు సరికదా దానిని శిరసావహిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 9 మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. వారి ముగ్గురి పేర్లను చిట్టీలపై రాసి భైరవనాథ్ ఆలయంలో పెట్టారు. పది నిమిషాలు వేచి చూసిన తరువాత ఈగ గారు ఝామ్మంటూ వచ్చి ఓ చిట్టీపై వాలారు.
దీంతో గ్రామస్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ చిట్టీని తెరవగా సంజీవని తింగ్లే అనే మహిళ పేరు ఉంది. ఈగగారి తీర్పుననుసరించి గ్రామస్థులు ఆమెను ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బవుతూ, తనను ఉపసర్పంచ్ ను చేసిన ఈగకు కృతజ్ఞతలు తెలిపి, పదవీబాధ్యతలు స్వీకరించారు. దీనిని తెలుసుకున్న జిల్లా అధికారులు... ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లదంటూ గ్రామస్థులపై మండిపడ్డారు. జిల్లా అధికారులను పట్టించుకోకుండా, 'తనే ఉపసర్పంచ్' అంటూ గ్రామస్థులు తేల్చి చెప్పేశారు.