: ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 31 ఏసీలు, 12 గీజర్లు
ఒక ఇంట్లో ఎన్ని ఏసీలు అవసరం అవుతాయి? మహా అయితే ఓ ఐదు... మరీ ఎక్కువ గదులు ఉంటే మరో రెండు మూడు అవసరం అవుతాయి. అంతేనా? కానీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో 31 ఏసీలు ఉండేవట. అలాగే 25 రూం హీటర్లు ఉండేవట. సుమారు 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ అధికారం వెలగబెట్టారు. ఆ సమయంలో ఆమె మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న బంగ్లాలో నివాసం ఉండేవారు. ఆ నివాసంలో 31 ఏసీలు, 15 డిజర్ట్ కూలర్లు, 25 రూం హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు ఉండేవట. ఆమె అవసరాలకు అనుగుణంగా బంగ్లాకు మార్పులు చేసేందుకు 16.81 లక్షల రూపాయలు వినియోగించారని సీపీడబ్ల్యూడీ వెల్లడించింది. కేరళ రాష్ట్రానికి ఆమె గవర్నర్ గా వెళ్లడంతో వాటిని తీసేశారని, కొన్నింటిని ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారని, మరి కొన్నింటిని అవసరమైనప్పుడు వాడుతారని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆమె నివాసం ఉన్న బంగ్లాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం ఉంటున్నారు. ఈ వివరాలన్నీ ఓ హక్కుల కార్యకర్త సంపాదించడం విశేషం.