: బికినీలు వేసుకుని స్విమ్మింగ్ మాత్రమే చేయండి: గోవా సీఎం వ్యాఖ్య
గోవాలో సీఎంతో సహా మంత్రులు భారతీయ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అశ్లీలతకు తావులేని ప్రజాజీవనంపై వారి పోరాటం కొనసాగుతోంది. తాజాగా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ, బికినీలు వేసుకుని స్విమ్మింగ్ మాత్రమే చేయాలని సూచించారు. బికినీలు ధరించి ఇతరత్రా కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజాజీవనానికి ఇబ్బందులు సృష్టించరాదని హితవు పలికారు. పనాజీలో ఆయన మాట్లాడుతూ, "బికినీలు అసభ్యకరం అని భావించడంలేదు, గోవాలో నా చిన్నప్పటి నుంచి బికినీలు చూస్తున్నా. కానీ, బికినీలను స్విమ్మింగ్ కే పరిమితం చేయాలి" అని పేర్కొన్నారు. తామేమీ బికినీలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం మంత్రి ధవాలికర్ మాట్లాడుతూ, గోవా బీచ్ లలో బికినీలపై నిషేధం విధించాలని, అమ్మాయిలు చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని పబ్ లకు వెళ్ళడాన్ని నిరోధించాలని వ్యాఖ్యానించారు. దీంతో, గోవాలో పలువర్గాలు మంత్రి వ్యాఖ్యలను నిరసించాయి.
కాగా, జాతీయస్థాయి మహిళా సంఘం ఏఐపీడబ్ల్యూఏ కార్యదర్శి కవితా కృష్ణన్ మాట్లాడుతూ, ఇతరుల సంస్కృతిని వేలెత్తి చూపేముందు రాష్ట్రంలోని బీజేపీ సర్కారు తన సొంత సంస్కృతిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.