: సాయిబాబాపై మరోసారి విరుచుకుపడ్డ ద్వారకాపీఠాధిపతి
ద్వారాకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి సాయిబాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా మాంసం తినేవాడని, అల్లాను ఆరాధించేవాడని, అలాంటి వ్యక్తి హిందూ దేవుడు ఎన్నటికీ కాలేడని పేర్కొన్నారు. సాయి భక్తులు సనాతన ధర్మానికి చెందిన దేవుళ్ళ ప్రతిమలు వాడుకుని పబ్బం గడుపుకుంటున్నారని స్వరూపానంద దుయ్యబట్టారు. "మన దేవుళ్ళ బొమ్మలు పెట్టుకోకపోతే, వారికి సర్వం ఎవరు సమకూరుస్తారు?" అని ప్రశ్నించారు. అయితే, ప్రజలు తమకిష్టమైన వారిని ఆరాధించుకోవచ్చని ఈ ద్వారకాపీఠాధిపతి పేర్కొన్నారు. కానీ, తనను తాను భగవంతుడినని చెప్పుకునే సాయిబాబాను అంగీకరించరాదని సూచించారు.
మనకున్నది ఐదుగురు దేవుళ్ళని, వారు కాకుండా మరెవరైనా దైవాన్నంటూ వస్తే, అది మనకు ఆమోదయోగ్యం కాదని ఆయన వివరించారు. ఇక, కాంగ్రెస్ తరఫున వకాల్తా పుచ్చుకుని సాయిబాబాపై ధ్వజమెత్తుతున్నారన్న ఆరోపణలను స్వరూపానంద ఖండించారు. తాను కాంగ్రెస్ కు అనుగుణంగా పనిచేస్తున్నానని పేర్కొనడం తప్పు అని, తాను రాజకీయనేతను కానని స్పష్టం చేశారు.