: జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత... గాల్లోకి కాల్పులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ షేక్ జానీని వైఎస్సార్సీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ధర్నాకు దిగారు. టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు కంచెను ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో, పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.