: సరదా రేపిన మతకల్లోలం


ఇద్దరు మిత్రుల మధ్య చిలిపి గొడవ మత కల్లోలానికి దారితీసింది. హాస్యం హద్దుమీరి అపహాస్యమైన ఈ సంఘటన మీరట్ లో చోటు చేసుకుంది. అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని లాల్ కుర్తీ ప్రాంతంలో పింటూ, అజ్జూ అనే ఇద్దరు మిత్రులకు వేళాకోళం ఆడుకోవడం, ఆటపట్టించుకోవడం సరదా. ఎప్పట్లానే వేళాకోళం ఆడుకుంటున్న పింటూ ఓ అగ్గిపుల్ల వెలిగించి అజ్జూపైకి విసిరాడు. పింటూపై మండిపడ్డ అజ్జూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకర్నొకరు తిట్టుకుని, తోసుకున్నారు. దీంతో తిక్కరేగిన అజ్జూ తన మిత్రులకు ఫోన్ చేసి పింటూ తాట తీయాలని పిలిపించాడు. తానేం తక్కువ తిన్నానా అంటూ పింటూ తన మిత్రులకు ఫోన్ చేసి లాఠీలతో రమ్మన్నాడు. అంతే... ఇద్దరు మిత్రుల మధ్య రాజుకున్న వివాదం క్షణాల్లో మతకల్లోలంగా మారింది. నినాదాలు హోరెత్తాయి. లాఠీలు, ఈటెల ధాటికి పలువురు గాయాలపాలయ్యారు.

ఇంతలో సందట్లో సడేమియాలా ఎవరో నాటు తుపాకీ పేల్చారు. అంతే జనం శివాలెత్తిపోయారు. పెళ్లి బస్సు సహా కనిపించిన ప్రతి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇళ్లపైకి రాళ్లు విసిరి నానాబీభత్సం సృష్టించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీ ఛార్జీ చేసి, కర్ఫ్యూ విధిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. కాగా, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఎవరు ఎవరిపై దాడి చేస్తారో తెలియని అనిశ్చితి తలెత్తింది.

  • Loading...

More Telugu News