: వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడొచ్చు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా, విస్తారంగా వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. దీంతో, రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడితే దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.