: ఎన్టీఆర్ అవార్డు దక్కడం సంతోషంగా ఉంది: అమితాబ్
రాష్ట్ర చలన చిత్ర అవార్డుల పండుగ నంది పురస్కరాల ప్రదానోత్సవం ఈ సాయంత్రం తెలుగు లలిత కళాతోరణంలో ఘనంగా ఆరంభమైంది. సీఎం కిరణ్ లాంఛనంగా కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం చలనచిత్ర, టీవీ, నాటకరంగ సంచికను ఆవిష్కరించారు. ఇక ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని సీఎం చేతులమీదుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అందించారు.
ఈ సందర్భంగా బిగ్ బి మాట్లాడుతూ, తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఎన్టీఆర్ పేరిట నెలకొల్పిన ఈ అవార్డును స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఇక, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డును నిర్మాత ఆదిశేషగిరిరావు అందుకున్నారు.
కాగా, నవరసనటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణను రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. సీఎం కిరణ్ చేతులమీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. సత్యానారాయణ మాట్లాడుతూ, తననీ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో మరువలేని పురస్కారం ఇదని ఆయన ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. తనని తీర్చిదిద్దిన దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డు దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, జె.గీతారెడ్డి, పితాని ప్రసాద్, మూవీ మొఘల్ రామానాయుడు, అల్లు అరవింద్,నాగార్జున, అమల, రాజశేఖర్, జీవిత, అశోక్ కుమార్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.