: 'ఫిఫా'పై ఉరుగ్వే అధ్యక్షుడి బూతు ప్రయోగం... వంతపాడిన భార్య!


తమ స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్ పై ఫిఫా నిషేధం విధించడం పట్ల ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా తిట్ల పురాణం లంకించుకున్నారు. ఫిఫా కార్యవర్గాన్ని రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. చర్యలు తీసుకోవాల్సిందేగానీ, అవి నియంతృత్వ ధోరణిలో ఉండరాదని ముజికా పేర్కొన్నారు. ఓ టెలివిజన్ క్రీడా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ అంటే ఏమనుకుంటున్నారు?' అనడిగిన ప్రశ్నకు, "అదా... ముసలి ... కొడుకుల సమూహం" అంటూ బూతులు ప్రయోగించారు. ఆ వెంటనే నోటిని చేత్తో మూసేసుకున్నారు. దీనిపై, ఎదురుగా ఉన్న మహిళా యాంకర్... 'మీ వ్యాఖ్యలను ప్రసారం చేయొచ్చా?' అని అడగ్గా, 'తప్పకుండా ప్రసారం చేయండి, నా కోసం' అని బదులిచ్చారు ముజికా.

అనంతరం కెమెరాను ముజికా సతీమణి వైపు తిప్పి... 'అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తారా?' అని ప్రశ్నించగా, 'ఆయన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను' అంటూ తన పాతివ్రత్యాన్ని చాటుకున్నారు. బ్రెజిల్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్ లో ఉరుగ్వే ఫార్వర్డ్ స్వారెజ్ ఇటలీ డిఫెండర్ చిల్లినీ చెవి కొరకడంతో ఫిఫా 9 మ్యాచ్ ల నిషేధం విధించింది. నాలుగు నెలలపాటు స్వారెజ్ ఎలాంటి సాకర్ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ పోటీలకు కూడా హాజరుకారాదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News