: తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన వారంతా లోకలే!
మీరు చదివింది నిజమే. తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులంతా స్థానికులుగా పరిగణనలోకి వస్తారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... మెడిసిన్ పీజీ సీట్ల భర్తీలో కొత్త వివాదం తలెత్తింది. పీజీ ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన వారంతా తెలంగాణలోని వైద్య కళాశాలల్లోనే చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 500 సీట్లను భర్తీ చేయగా... సగానికి పైగా సీట్లను సీమాంధ్ర విద్యార్థులే చేజిక్కించుకున్నారు. దీంతో తాము భారీగా నష్టపోతున్నామని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్య అధికారులు మాత్రం ఈ విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. రాష్ట్ర విభజన బిల్లులోని 10వ షెడ్యూల్ లో వృత్తి విద్యా ప్రవేశాలను పొందుపరిచారని... దీని ప్రకారం తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులంతా స్థానికులుగా పరిగణనలోకి వస్తారని స్పష్టం చేశారు.